Subscribe For Free Updates!

Thursday, 5 December 2013

మొబైల్‌ చిట్కా!



స్మార్ట్‌ మొబైల్‌ వాడుతున్నవారందరూ 'పేట్రన్‌ లాక్‌' వాడుతూనే ఉంటారు. కొన్నిసార్లు లాక్‌ తీయడం మర్చిపోతుంటాం. లేదంటే కుటుంబ సభ్యులో, స్నేహితులో ఎక్కువ సార్లు ప్రయత్నించడం వల్ల పేట్రన్‌ లాక్‌ డిసేబుల్‌ అవుతుంది. మీ రిజిస్టరైన జీమెయిల్‌ ఐడీతో లాగిన్‌ అయితేనే తిరిగి పని చేస్తుంది. తిరిగి కొత్త పేట్రన్‌ లాక్‌ని సెట్‌ చేసుకోవచ్చు. కానీ, కొన్నిసార్లు రిజిస్టరైన జీమెయిల్‌ లాగిన్‌ వివరాలు కూడా మర్చిపోతే? పేట్రన్‌లాక్‌ని డిసేబుల్‌ చేయడం ఎలా? అందుకో చిట్కా ఉంది. ఫోన్ని రీస్టోర్‌ చేసి తిరిగి వాడుకోవచ్చు. ఇలా రీసెట్‌ చేస్తే మొత్తం యూజర్‌ డేటా, సెట్టింగ్స్‌ తొలగిపోతాయి. 'రీస్టోర్‌ ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌' మాదిరిగా అన్నమాట. ఫోన్‌ మెమొరీ ఉన్న డేటా మొత్తం తొలగిపోతుంది. ఎస్‌కార్డ్‌లో మెమొరీ మాత్రం అలానే ఉంటుంది. ఇక చిట్కా చమత్కారం ఎలాగో చూద్దాం... మీరు ఆండ్రాయిడ్‌ మొబైల్‌ని వాడుతున్నట్లయితే లాక్‌ అయిన ఫోన్ని ముందుగా షట్‌డౌన్‌ చేయాలి. ఇప్పుడు ఫోన్‌లోని Volume Up బటన్‌ నొక్కి ఉంచితే 'ఆండ్రాయిడ్‌ రికవరీ స్క్రీన్‌' వస్తుంది. ఒకవేళ రాకపోతే పై రెండు కీలతో పాటు Home Screenబటన్‌ని కూడా నొక్కాలి. వచ్చిన రికవరీ స్క్రీన్‌లోని Wipe data/factory reset సెలెక్ట్‌ చేసి Yes ఆప్షన్ని ఎంపిక చేసుకోవాలి. దీంతో మొత్తం యూజర్‌ డేటా తొలగిపోయి తిరిగి రికవరీ స్క్రీన్‌ వస్తుంది. మెనూలోనిReboot System now ఆప్షన్ని సెలెక్ట్‌ చేయాలి. దీంతో ఫోన్‌ కొన్నప్పుడు ఎలా ఉందో అదే మాదిరిగా ఓపెన్‌ అవుతుంది. ఒకవేళ మీరు గతంలో యూజర్‌ డేటాని బ్యాక్‌అప్‌ చేసుకున్నట్లయితే తిరిగి సింక్రనైజ్‌ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్‌ యూజర్లు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. అదే డేటా బ్యాక్‌అప్‌. స్మార్ట్‌ మొబైల్‌ వాడే యూజర్లు డేటాని ఎప్పటికప్పుడు ఎస్‌డీ కార్డ్‌లోకి బ్యాక్‌అప్‌ చేసుకోవడం మంచిది. అనివార్య కారణాల వల్ల ఫోన్ని రీసెట్‌ చేస్తే డేటాని సురక్షితంగా బ్యాక్‌అప్‌ చేసుకోవచ్చు. ముఖ్యమైన మెసేజ్‌లు ఏవైనా ఉంటే 'స్క్రీన్‌ కాప్చర్‌' చేసుకుని భద్రం చేసుకోవడం మంచిది.

* డేటాని బ్యాక్‌అప్‌ చేసుకునేందుకు గూగుల్‌ ప్లేలో చాలానే ఆప్స్‌ ఉన్నాయి. వాటిల్లో 'సూపర్‌ బ్యాక్‌అప్‌' ఒకటి. అన్నింటినీ ఎస్‌డీ కార్డ్‌లోకి బ్యాక్‌అప్‌ చేసుకోవచ్చు. http://goo.gl/ZN0jtz

* ఆప్స్‌ని మాత్రమే బ్యాక్‌అప్‌ చేసుకునేందుకు App Backup & Restore ఉంది. http://goo.gl/aljDTj

గూగుల్‌ గంపలోకి...తాజా సరుకు!

                                                 వెతుకులాట...
                                                 వెబ్‌ విహారం...
                                              అవసరానికి ఆప్స్‌...
                                            దాచుకోవడానికి క్లౌడ్‌స్టోర్‌...
                                          ఇలా అన్నింటికీ అడ్డా గూగులే!
                                       ఇప్పుడు కొత్తగా మరికొన్ని చేరాయి!
                                          అవే 'క్రోమ్‌ బుక్‌',' క్రోమ్‌ బాక్స్‌'
మీకో.. ఇంట్లో కుటుంబ సభ్యలకో పీసీ కొనాలనుకున్నారనుకోండి. మార్కెట్‌లోకి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, నోట్‌బుక్స్‌, నెట్‌బుక్స్‌, ట్యాబ్లెట్‌లను వెతికేస్తాం. ధరలు చూస్తాం. వాటిల్లోని సౌకర్యాల్ని తెలుసుకుంటాం. తర్వాతే ఏది కొనాలో నిర్ణయించుకుంటాం. ఇప్పుడు మీ జాబితాలోకి కొత్తగా 'క్రోమ్‌బుక్‌' వచ్చి చేరింది. తక్కువ బరువుతో నాజూకుగా యూజర్లను ఆకట్టుకుంటోంది. మార్కెట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న అన్ని పీసీలకు భిన్నంగా ఇది పని చేస్తుంది. కాన్ఫిగరేషన్‌లోనూ చాలా మార్పులు ఉన్నాయి. మరి, గూగుల్‌ ఇతర కంపెనీలతో సంయుక్తంగా అందిస్తున్న ఉత్పత్తుల సంగతులెంటో కాస్త వివరంగా తెలుసుకుందాం!


ఏంటి ప్రత్యేకతలు?
ఒక్కమాటలో చెప్పాలంటే ఇది కూడా నెట్‌బుక్‌ లాంటిదే. అంతర్జాలంలో నిత్యం విహరించేవారికి ఇదో సరైన వేదిక. దీంట్లో ఎలాంటి డిస్క్‌ డ్రైవ్‌లు ఉండవు. నెట్టింట్లో అందుబాటులో ఉన్న క్లౌడ్‌స్టోరేజ్‌నే వాడుకోవాలి. మరి, అప్లికేషన్లను ఎలా ఇన్‌స్టాల్‌ చేయాలంటారా? వాటినీ క్లౌడ్‌ స్థావరాల నుంచి వాడుకోవడమే. గూగుల్‌ అందించే 'వెబ్‌ స్టోర్‌' అందుకు ఉదాహరణ. సుమారు 30,000 ఆప్స్‌ దాంట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సెస్‌ చేయవచ్చు. ఇక సోషల్‌ నెట్‌వర్కింగ్‌, నెబ్‌ బ్రౌజింగ్‌ అంతా మామూలే. గూగుల్‌ అందించే 'డ్రైవ్‌'ని వాడుకోవచ్చు. ఆఫీస్‌ వర్క్స్‌ని చేసుకునేందుకు 'గూగుల్‌ డాక్స్‌' ఉండనే ఉంది. అలాగే, దీంట్లో మరో ముఖ్యమైన విషయం ఆపరేటింగ్‌ సిస్టం. విండోస్‌... లేదంటే లినక్స్‌ అనుకునేరు. అదేం కాదు. 'క్రోమ్‌ ఓఎస్‌' దీన్ని కూడా గూగుల్‌ బృందమే రూపకల్పన చేసింది. క్రోమ్‌ వెబ్‌ బ్రౌజర్‌ మాదిరిగానే ఇది పని చేస్తుంది. అన్ని ఓఎస్‌ల మాదిరిగానే దీనిపైనే క్లౌడ్‌ ఆప్స్‌ని రన్‌ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ ఆటోమాటిక్‌గా జరిగిపోతాయి. సిస్టంని వాడుకోవాలంటే యూజర్‌ వాడే జీమెయిల్‌ ఐడీ వివరాలతో లాగిన్‌ అవ్వాలి.

కాన్ఫిగరేషన్‌ మాటేంటి?
సాధారణ ల్యాపీ మాదిరిగానే కనిపించే క్రోమ్‌ బుక్‌ తెర పరిమాణం 14 అంగుళాల వరకూ ఉంది. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 16 జీబీ. కావాలంటే 32 జీబీ వరకూ పెంచుకునే వీలుంది. ర్యామ్‌ విషయానికొస్తే 2 జీబీతో పని చేస్తుంది. ఇక డేటా స్టోరేజ్‌ కోసం గూగుల్‌ అందించే 'డ్రైవ్‌'ని వాడుకోవచ్చు. అంతేకాదు... అదనంగా గూగుల్‌ 100 జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ స్పేస్‌ని రెండేళ్ల పాటు ఉచితంగా అందిస్తోంది. దీంతో పాటు... ఇతర ఉచిత క్లౌడ్‌ స్థావరాల్ని కూడా వాడుకోవచ్చు. ఉదాహరణకు 'డ్రాప్‌బాక్స్‌'. దీంట్లో సభ్యులైతే 2 జీబీ ఉచిత స్పేస్‌ని క్రోమ్‌బుక్‌కి వాడుకోవచ్చు. ఇతర ప్రీమియం డేటా ప్లాన్స్‌ కూడా ఉన్నాయి. అలాగే, మైక్రోసాఫ్ట్‌ అందించే 'స్కైడ్రైవ్‌' కూడా. 'బాక్స్‌' సర్వీసు నుంచి 5 జీబీని ఉచితంగా వాడుకోవచ్చు. 'షుగర్‌సింక్‌' మరోటి. దీంట్లోనూ 5 జీబీ ఉచితం. 'బిట్‌కాసా' క్లౌడ్‌ స్పేస్‌ నుంచి 5 జీబీని వాడుకునే వీలుంది. చెప్పాలంటే ఇంకా చాలా సర్వీసుల నుంచి క్లౌడ్‌స్పేస్‌ని ఉచితంగా వాడుకోవచ్చు. ఇంకో చిట్కా ఏంటంటే... ఎక్కువ స్పేస్‌ కోసం ఎక్కువ ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేసుకోవడమే. ఒక జీమెయిల్‌ ఎకౌంట్‌కి గూగుల్‌ డ్రైవ్‌ నుంచి 5 జీబీ ఉచితంగా కదా. మరో 5 జీబీ కావాలనుకుంటే మరో జీమెయిల్‌ ఎకౌంట్‌ క్రియేట్‌ చేసుకుంటే సరి.

ఎప్పుడూ నెట్‌ ఉండాలా?
క్రోమ్‌ బుక్‌ని వాడాలంటే ఎప్పుడూ నెట్‌ కనెక్షన్‌ అవసరమా? అనే సందేహం కచ్చితంగా వస్తుంది. ఆఫ్‌లైన్‌లోనూ క్రోమ్‌ బుక్‌ని వాడుకునే వీలుంది. జీమెయిల్‌ని యాక్సెస్‌ చేయవచ్చు. గూగుల్‌ డ్రైవ్‌లోని డాక్యుమెంట్స్‌ని యాక్సెస్‌ చేసి మార్పులు చేయవచ్చు. కొన్ని రకాల గేమ్స్‌ని కూడా ఆడొచ్చు. క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌లో అందుకు అనువుగా ఆఫ్‌లైన్‌లో రన్‌ అయ్యే ఆప్స్‌ చాలానే ఉన్నాయి. వాటిని 'క్రోమ్‌ఓఎస్‌'కి యాడ్‌ చేసిన తర్వాత నెట్‌ కనెక్షన్‌ లేనప్పటికీ వాటిని వాడుకోవచ్చు. కానీ, ఎక్కువగా నెట్‌కి అనుసంధానమై పని చేసేవారికే క్రోమ్‌బుక్‌ అనుకూలం. ఇతర విండోస్‌ ఓఎస్‌తో పని చేసే ల్యాపీలతో పోలిస్తే బూట్‌ అయ్యేందుకు చాలా తక్కువ సమయం పడుతుంది. ఆన్‌ చేసిన తర్వాత

కేవలం 7 సెకన్లలోనే ల్యాపీ
వాడుకునేందుకు సిద్ధం అవుతుంది. బ్యాటరీ ఛార్జింగ్‌ కూడా ఎక్కువ సమయం వస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేసి 9.5 గంటలు వాడుకోవచ్చు. బరువు కూడా తక్కువే. ఎక్కువగా ప్రయాణాలు చేసే వారికి అనుకూలం. క్రోమ్‌బుక్‌లో ఏదైనా సమస్య వస్తే మొబైల్‌లో మాదిరిగా 'ప్యాక్టరీ రీసెట్‌' చేయవచ్చు. దీన్నే 'పవర్‌వాష్‌'గా పిలుస్తున్నారు. ల్యాపీలోని 'సెట్టింగ్స్‌'లోకి వెళ్లి రీసెట్‌ చేయవచ్చు. దీంతో ల్యాపీ కొన్నప్పుడు ఎలా ఉందో అలా మారిపోతుంది. ఇతరులెవరైనా ల్యాపీని వాడుకోవాల్సి వస్తే వారి జీమెయిల్‌ ఐడీతోనే లాగిన్‌ అయ్యి వాడుకోవచ్చు. ఒకవేళ ఇలా వాడడాన్ని డిసేబుల్‌ చేయాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'గెస్ట్‌ యాక్సెస్‌'ని డిసేబుల్‌ చేయాలి.

అంతా ఆప్స్‌తోనే...
క్రోమ్‌ ఓఎస్‌లో కావాల్సిన మీటలతో మీరే 'షార్ట్‌కట్స్‌'ని క్రియేట్‌ చేసుకోవచ్చు. అందుకు అనువైన ఆప్‌ 'క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌'లో సిద్ధంగా ఉంది. అదే Shortcut Manager. ఓఎస్‌కి యాడ్‌ చేసుకుని కావాల్సినట్టుగా మార్పులు చేసుకోవచ్చు. http://goo.gl/rgVf5h

* క్రోమ్‌ బుక్‌లోనే ఇతర విండోస్‌, లినక్స్‌, మ్యాక్‌ ఓఎస్‌లతో పని చేసే ఇతర సిస్టంలనూ యాక్సెస్‌ చేయవచ్చు. అందుకు అనువైన ఆప్‌ ఒకటి వెబ్‌ స్టోర్‌లో ఉంది. అదే VNC Viewer for Google Chrome. ఆప్‌తో రిమోట్‌ యాక్సెస్‌ ద్వారా క్రోమ్‌ ఓఎస్‌లో ఇతర పీసీలను వాడుకోవచ్చు. http://goo.gl/2fCctF

* ఫొటోలను ఎడిట్‌ చేసేందుకు ఆడోబ్‌ లేదని చింతించక్కర్లేదు. వెబ్‌ స్టోర్‌ నుంచి Pixlr Editor ఆప్‌ని వాడొచ్చు. ఓఎస్‌కి యాడ్‌ చేసుకుని ఫొటోలను అప్‌లోడ్‌ చేసి ఎడిటింగ్‌ ప్రక్రియ చేపట్టవచ్చు.http://goo.gl/DNnktT

* ఫొటో ఎడిటింగ్‌కి మరోటి Sumo Paint.వివిధ రకాల మోడ్స్‌లో ఫొటోలను ఎడిట్‌ చేయవచ్చు.http://goo.gl/NZOP9m

* ఎమ్మెస్‌ ఆఫీస్‌ ఫైల్స్‌ని క్రోమ్‌లో చేసేందుకు Open with Office Web apps Viewer ఆప్‌ని వాడొచ్చు. http://goo.gl/NnlxbZ

ఇవి కొంచెం కష్టమే...
విండోస్‌లో వాడే అప్లికేషన్లను క్రోమ్‌బుక్‌లో వాడడం అసాధ్యం. వెబ్‌ స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఆప్స్‌ని మాత్రమే ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడుకోగలరు. ఫైర్‌ఫాక్స్‌, వీఎల్‌సీ ప్లేయర్‌, విన్‌రార్‌, ఎమ్మెస్‌ ఆఫీస్‌, అడోబ్‌ ఫొటోషాప్‌... లాంటి పేరొందిన సాఫ్ట్‌వేర్‌లను వాడడం కుదరదు. 3డీ గేమ్స్‌ని సపోర్ట్‌ చేయదు. తక్కువ ఇంటర్నల్‌ మెమొరీ ఉండడం వల్ల వీడియోలను సేవ్‌ చేయడం కష్టం. పెన్‌డ్రైవ్‌, ఎక్సటర్నల్‌ స్టోరేజ్‌ డ్రైవ్‌లతో సినిమాలు, వీడియో ఫైల్స్‌ని ప్లే చేసి చూడొచ్చు. ఎంపీ4 వీడియోలను మాత్రమే ఫుల్‌ రిజల్యుషన్‌లో చూడొచ్చు. ఎంకేవీ, ఎఫ్‌ఎల్‌వీ, డబ్యుఎంవీ వీడియో ఫార్మెట్‌ ఫైల్స్‌ ప్లే చేయలేం.
''క్రోమ్‌ బుక్‌ బూటింగ్‌ అయ్యేందుకు పట్టే సమయం కేవలం 7 సెకన్లే!
బ్యాటరీ బ్యాక్‌అప్‌ సుమారు 9 గంటలు!"


కొన్ని క్రోమ్‌బుక్‌లు...
హెచ్‌పీ కంపెనీతో జతకట్టి రూపొందించిన ల్యాపీనే HP Chromebook 14. తెర పరిమాణం 14 అంగుళాలు. రిజల్యూషన్‌ 1366X768పిక్సల్స్‌. 1.4GHz Intel Celeron 2955Uప్రాసెసర్‌ని వాడారు. స్టోరేజ్‌ సామర్థ్యం 16 జీబీ. గూగుల్‌ డ్రైవ్‌లోని 100 జీబీని రెండేళ్ల పాటు ఉచితంగా పొందొచ్చు.. ర్యామ్‌ 2జీబీ. Dongleసాయంతో 3జీ సేవల్ని వాడుకోవచ్చు. యూఎస్‌బీ పోర్ట్‌లు, కార్డ్‌ రీడర్‌ ఉన్నాయి. బ్లూటూత్‌, వై-ఫై సేవల్ని వాడుకోవచ్చు. బరువు 1.85 కేజీలు. బ్యాటరీ సామర్థ్యం 9.5 గంటలు. ధర సుమారు రూ.26,990.ఇతర వివరాలకు http://goo.gl/FXSFZ0లింక్‌లోకి వెళ్లండి.

* ఏసర్‌ కంపెనీతో ముందుకొచ్చిన మరో మోడల్‌ Acer C720. తెర పరిమాణం 11.6 అంగుళాలు. రిజల్యూషన్‌1366X768 పిక్సల్స్‌. 1.4GHz Intel Celeron 2955Uప్రాసెసర్‌ని వాడారు. మెమొరీ సామర్థ్యం 16 జీబీ. 100 జీబీ గూగుల్‌ డ్రైవ్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌ని వాడుకోవచ్చు. ర్యామ్‌ 2జీబీ. వీజీఏ వెబ్‌ కెమెరా ఉంది. యూఎస్‌బీ పోర్ట్‌లు, కార్డ్‌ రీడర్‌ ఉన్నాయి. ల్యాపీ బరువు 1.25 కేజీలు. ధర సుమారు రూ.22,999.ఇతర వివరాలకు http://goo.gl/0AzzK5లింక్‌లోకి వెళ్లండి.

* శామ్‌సంగ్‌ మరో క్రోమ్‌ బుక్‌ని అందిస్తోంది.వివరాలకుhttp://goo.gl/YFBK7jలింక్‌ని చూడండి.

ఇదేమో 'క్రోమ్‌బాక్స్‌'
ఇంట్లోని మానిటర్‌కి 'క్రోమ్‌బాక్స్‌'ని కనెక్ట్‌ చేసి క్రోమ్‌బుక్‌లా వాడుకోవచ్చు. ఇదో రకం డెస్క్‌టాప్‌ పీసీ అన్నమాట. ChromeBox పీసీని తయారు చేసింది శామ్‌సంగ్‌ కంపెనీ. డెస్క్‌టాప్‌ పీసీల పక్కన కనిపించే సీపీయూ మాదిరిగా ఇది పని చేస్తుంది. దీని కాన్ఫిగరేషన్‌ విషయానికొస్తే... Intel Celeron Processorవాడారు. ర్యామ్‌ 4జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 16 జీబీ. బిల్ట్‌ఇన్‌ వై-ఫై. 6 యూఎస్‌బీ పోర్ట్‌లు ఉన్నాయి. కీబోర్డ్‌, మౌస్‌లను బాక్స్‌కి కనెక్ట్‌ చేసి వాడుకోవచ్చు. డ్యుయల్‌ డిస్‌ప్లే పోర్ట్‌లు దీంట్లోని మరో ప్రత్యేకత. 30 అంగుళాల మానిటర్లకు కనెక్ట్‌ చేసి వాడుకోవచ్చు. క్రోమ్‌బుక్స్‌లో మాదిరిగానే గూగుల్‌ డ్రైవ్‌లోని 100 జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ని రెండేళ్ల పాటు ఉచితంగా వాడుకోవచ్చు. ఇతర వివరాలకు http://goo.gl/V32Vfmలింక్‌లోకి వెళ్లండి.

క్రోమ్‌కి ప్రత్యేకం...
* క్రోమ్‌బుక్‌లో గేమ్స్‌ ఆడేందుకు 90's Gamesఆప్‌ని వెబ్‌స్టోర్‌ నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. చిన్నప్పటి గేమ్స్‌కి ఇదో చిరునామా. http://goo.gl/jVtGdq

* ఫొటోలను ఆకట్టుకునేలా మలిచి సోషల్‌ లైఫ్‌లో పంచుకునేందుకు piZap Photo Editor ఆప్‌ని నిక్షిప్తం చేసుకోవచ్చు. http://goo.gl/ctlYH5

* ఆటలకు సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం365Scoresఆప్‌ని వాడొచ్చు. http://goo.gl/AC7wao

* వీడియోలను ఎడిట్‌ చేసేందుకు WeVideoఆప్‌ ఉంది.http://goo.gl/poJJS7

* క్రోమ్‌బుక్‌పై సరికొత్త అప్‌డేట్స్‌తో ప్రయోగాలు చేస్తూ ప్రయోజనాల్ని పొందేందుకుwww.chromeexperiments.comసైట్‌లోని ఆప్స్‌ని ప్రయత్నించొచ్చు.

Thursday, 28 November 2013

పిట్టకొంచెం... కూత ఘనం!


ల్యాపీలు... స్మార్ట్‌ మొబైళ్లు. వాటిల్లో పాటలు... సినిమాలు. మరి, ఇన్‌బిల్ట్‌ స్పీకర్లతో వినడం కంటే... బ్లూటూత్‌ స్పీకర్లు ప్రయత్నించండి! ఎప్పుడైనా.. ఎక్కడైనా... వినడమేకాదు... కాల్స్‌ మాట్లాడొచ్చు కూడా! వాటి సంగతులేంటో చూద్దాం!
చేతిలో సరిపోతుంది
అన్ని సందర్భాల్లోనూ ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకుని పాటలు వినలేం. అలాంటప్పుడు Bose SoundLink Mini స్పీకర్‌ని వాడొచ్చు. Bass Outputదీంట్లోని ప్రత్యేకత. మ్యూజిక్‌ ఫార్మెట్‌ ఏదైనా దీంట్లో ప్లే చేయవచ్చు. బ్లూటూత్‌ ద్వారా మొబైల్‌, ల్యాపీ, ఎంపీ3 ప్లేయర్లకు కనెక్ట్‌ అవుతుంది. స్పీకర్‌ పై భాగంలో కంట్రోల్‌ బటన్స్‌ని ఏర్పాటు చేశారు. స్పీకర్‌ని ఒకసారి ఛార్జ్‌ చేస్తే 6.5 గంటలు పాటు వాడుకోవచ్చు. మూడు గంటల్లో పూర్తిగా ఛార్జ్‌ అవుతుంది. ఛార్జింగ్‌ అవుతున్నప్పుడూ పాటలు వినొచ్చు. వివిధ రంగుల్లో స్పీకర్లు అందుబాటులో ఉన్నాయి. ధర సుమారు రూ. 16,200. http://goo.gl/dGbgel

రెండు రకాలుగా...

పాటలు వినడంతో పాటు అనివార్యమైన సందర్భాల్లో ఫోన్ని ఛార్జ్‌చేసే పవర్‌ బ్యాక్‌అప్‌ పరికరంగా వాడుకునేందుకు JBL Charge స్పీకర్‌ ఉంది. ల్యాపీ బ్యాక్‌ప్యాక్‌లో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. దీంట్లో నిక్షిప్తం చేసిన 6000mAhబ్యాటరీతో స్పీకర్‌ని 10 గంటల పాటు వాడుకోవచ్చు. అంతేకాదు... మొబైల్‌ ఛార్జింగ్‌ అయిపోతే యూఎస్‌బీ ద్వారా స్పీకర్‌కి కనెక్ట్‌ చేసి ఛార్జ్‌ చేయవచ్చు. ధర సుమారు రూ. 9,990.http://goo.gl/O0UJRS

కాల్స్‌ కూడా...

పోర్టబుల్‌ సైజుతో హ్యాండ్‌ బ్యాగ్‌లో ఇమిడిపోతుంది. స్పీకర్‌ పేరు Creative Airwave. పాటల్ని ప్లే చేయడంతో పాటు మీకొచ్చే కాల్స్‌ని కూడా వినిపిస్తుంది. అందుకు అనువుగా ఇన్‌బిల్ట్‌ మైక్‌ని ఏర్పాటు చేశారు. దీంతో మీరు ఫోన్‌కాల్స్‌ మాట్లాడొచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 10 నుంచి 10.5 గంటలు పాటలు వినొచ్చు. బూట్లూత్‌ ద్వారా ఫోన్‌, ట్యాబ్‌, ల్యాపీలను కనెక్ట్‌ చేసి వాడుకోవచ్చు. ధర సుమారు రూ.6,999. http://goo.gl/Gd2Qya

ఒకదానితో ఒకటి

స్టీరీయో సౌండ్‌ సిస్టంతో పాటలు వినేందుకు అనువైందిHDMX Jam Plus. రెండు స్పీకర్లు ఒకదానితో మరోటి కనెక్ట్‌ అయ్యి 'కుడి, ఎడమ ఆడియో ఛానల్స్‌'ని ప్లే చేస్తాయి.BassOutputఆకట్టుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే నాలుగు గంటల పాటు వాడుకోవచ్చు. బ్లూటూత్‌ ద్వారా మొబైల్‌, ట్యాబ్‌, ల్యాపీలకు అనుసంధానం చేయవచ్చు. ఒక్కో స్పీకర్‌ ధర రూ.3,990. http://goo.gl/agDQVT

మరింత నాణ్యత
కారులో వెళ్తున్నప్పుడో... స్నేహితులతో పార్టీ చేసుకునేప్పుడో... మీకు ఇష్టమైన పాటల్ని వినాలంటేJabra Solemate స్పీకర్‌ని వాడొచ్చు. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు మీకు వచ్చే కాల్స్‌ని మాట్లాడేందుకు స్పీకర్‌లో ఇన్‌బిల్ట్‌ మైక్‌ కూడా ఉంది. Bass Output పూర్తి స్థాయిలో వినిపిస్తుంది. ఒకవేళ మీరు వాడుతున్న ఫోన్‌, ల్యాపీ, ట్యాబ్లెట్‌కి బ్లూటూత్‌ సదుపాయం లేకపోతే 3.5 ఎంఎం పిన్‌ ద్వారా స్పీకర్‌ని కనెక్ట్‌ చేయవచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే టాక్‌టైం 10 గంటలు. పాటలు మాత్రం 8 గంటల పాటు వినొచ్చు. బ్యాటరీ స్టేటస్‌ని తెలుసుకునేందుకు ఇండికేటర్‌ ఉంది. ధర రూ.10,990. http://goo.gl/dVJ9CR

కొంచెం స్త్టెల్‌గా...

కాస్త ఆధునిక రూపంతో ఆకట్టుకునేలా బ్లూటూత్‌ స్పీకర్‌ని వాడుకోవాలనుకుంటే F&D M8 పోర్టబుల్‌ స్పీకర్‌ గురించి తెలుసుకోవాల్సిందే. బ్లూటూత్‌ ద్వారా స్పీకర్‌కి కనెక్ట్‌ అయ్యి 10 మీటర్ల పరిధిలో పాటలు వినొచ్చు. ఫోన్‌కాల్స్‌ కూడా మాట్లాడొచ్చు. స్పీకర్‌ని తీసుకెళ్లడానికి అనువుగా 'పౌచ్‌' ఉంది. యూస్‌బీ కేబుల్‌ ద్వారా ఛార్జ్‌ చేయవచ్చు. 3.5 ఎంఎం జాక్‌ ద్వారా కూడా స్పీకర్‌ని కనెక్ట్‌ చేయవచ్చు. ధర రూ.1,599. http://goo.gl/xQMWfq

చిన్నదే కానీ...
పరిమాణం చిన్నదేగానీ... పలికే సౌండ్‌ మాత్రం అదరాల్సిందే. అదే సోనీ కంపెనీ తయారు చేసిన SRS-BTV5 స్పీకర్‌. 'క్రిస్టల్‌ క్లియర్‌ సౌండ్‌'తో పాటలు వినొచ్చు. అంతేకాదు... ఇన్‌బిల్ట్‌గా ఏర్పాటు చేసిన 'స్పీకర్‌ఫోన్‌ బటన్‌'పై క్లిక్‌ చేసి ఎప్పుడైనా ఫోన్‌ కాల్స్‌ మాట్లాడే వీలుంది. 360 degree Circle Sound టెక్నాలజీతో స్పీకర్‌ అన్ని వైపులా మ్యూజిక్‌ వినిపిస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 5 గంటల పాటు మ్యూజిక్‌ వినొచ్చు. వినేటప్పుడే యూఎస్‌బీ కేబుల్‌ ద్వారా స్పీకర్‌ని ఛార్జ్‌ చేయవచ్చు.http://goo.gl/lFmbxa

'లాగీటెక్‌' కూడా...
పీసీ పరికరాల తయారీ కంపెనీ లాగీటెక్‌ కూడా Logitech UE BOOMBOX స్పీకర్‌ని అందిస్తున్నారు. స్పీకర్‌కి రెండు వైపులా కంట్రోల్‌ బటన్స్‌ని ఏర్పాటు చేశారు. 6 గంటలు పాటలు వినొచ్చు. ధర రూ.16,499.

చదువరులకు... చక్కని ఆప్స్‌!


స్మార్ట్‌ మొబైల్‌ చేతిలో ఉంటే...
ఆప్స్‌, అంతర్జాలమే కాదు...
ఈ-పుస్తకం కూడా చేతిలో ఉన్నట్టే!
పుస్తక ఫార్మెట్‌ ఏదైనా...
చక్కగా ఫోన్‌లోనే చదువుకోవచ్చు!
అందుకు తగిన ఆప్స్‌ సిద్ధం!



అంతా అంతర్జాలంలోనే. దిన పత్రికల దగ్గర్నుంచి అన్నీ డిజిటల్‌ ఫార్మెట్‌లోకి మారిపోతున్నాయి. పుస్తకాల గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే అన్ని ఆన్‌లైన్‌ గ్రంథాలయాల్లో సందడి చేస్తున్నాయి. మరి, ఈ-పుస్తకాల్ని చదవాలంటే ఈ-బుక్‌ రీడర్లే అవసరం లేదు. వాటిని కొనలేకపోతే ఫోన్నే ఈ-బుక్‌ రీడర్‌గా మార్చేయవచ్చు. ఆయా ఆప్స్‌ని ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకుని మొబైల్‌ని మిని లైబ్రరీగా మార్చేయవచ్చు. అంతర్జాలంలోని ఆయా మొబైల్‌ ఆన్‌లైన్‌ స్థావరాల నుంచీ పుస్తకాల్ని ఉచితంగా పొందొచ్చు. గూగుల్‌ ఈ-బుక్స్‌, ఐఓఎస్‌ ఐబుక్స్‌ వేదికలే అందుకు ఉదాహరణ. ఇక పబ్లిక్‌ డొమైన్స్‌లోనూ ఈ-పుస్తకాలు అనేకం. PDF, ePub, Mobi... ఫార్మెట్‌ల్లో కనిపించే ఆయా పుస్తకాల్ని మొబైల్‌లోకి కాపీ చేసుకుని ఈ-బుక్‌ ఆప్స్‌తో చదువుకోవచ్చు. మరి, వాటి సంగతులేంటో వివరంగా తెలుసుకుందాం!

ఆండ్రాయిడ్‌ వాడితే...

మునివేళ్లపై పేజీలు తిప్పుతూ పుస్తకాలు చదువుకునేలా Aldiko Book Reader ఆప్‌ని వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌పై రన్‌ అయ్యే ఈ-బుక్‌ అప్లికేషన్‌ను గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. 200 దేశాల్లో 15 మిలియన్ల యూజర్లు వాడుతున్నారు. ఉచితం, ప్రీమియం వెర్షన్లలో అందుబాటులో ఉంది. epub, PDF ఫార్మెట్స్‌ని ఇది సోపర్ట్‌ చేస్తుంది. ఎంపిక చేసుకున్న పుస్తకాల్ని 'సెల్ఫ్‌'లో చూపిస్తుంది. పబ్లిక్‌ లైబ్రరీల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న ఈ-పుస్తకాల్ని సపోర్ట్‌ చేస్తుంది. పుస్తకాల్ని చదివేందుకు అనువుగా మార్పులు చేయవచ్చు. ఫాంట్‌ సైజుని పెంచుకునే వీలుంది. 'ఫాంట్‌ టైప్‌'ని కూడా మీరే ఎంపిక చేసుకోవచ్చు. పుస్తకంలోని బ్యాక్‌గ్రౌండ్‌ కలర్‌, మార్జిన్స్‌, ఎలైన్‌మెంట్స్‌, లైన్‌ స్పేస్‌లను చదివేందుకు అనువుగా మార్పులు చేయవచ్చు. కళ్లకు ఒత్తిడి లేకుండా పుస్తకం 'బ్రైట్‌నెస్‌'ని మార్పుకునే వీలుంది. రాత్రి సమయంలో పుస్తకాల్ని చదవాల్సివస్తే 'నైట్‌ టైం రీడింగ్‌' మోడ్‌ని సెలెక్ట్‌ చేయవచ్చు. ఫోన్స్‌, ట్యాబ్లెట్‌లోనూ ఆప్‌ని వాడుకోవచ్చు. పుస్తకాన్ని చదివేప్పుడు 'బుక్‌మార్క్‌'లను పెట్టుకునే వీలుంది. మొత్తం పుస్తకాల్ని టాగ్స్‌ ద్వారా ఆర్గనైజ్‌ చేయవచ్చు. పుస్తకాన్ని సెలెక్ట్‌ చేయగానే ఆటోమాటిక్‌గా చదువుతున్న పేజీలోకి తీసుకెళ్తుంది. ఎక్కువ సమయం ఈ-పుస్తకాల్ని చదువుతున్నట్లయితే బ్యాక్‌గ్రౌండ్‌ని నలుపు రంగులో సెట్‌ చేసుకుని టెక్స్ట్‌ రంగుని తెలుపుగా మార్చుకుంటే మంచిది. అప్‌ కావాలంటే http://goo.gl/FRj3h8 లింక్‌ నుంచి పొందొచ్చు.
* ఇలాంటిదే మరోటి Mantano Ebook Reader Lite. సులువైన ఇంటర్ఫేస్‌తో ఈ-పుస్తకాల్ని చదువుకునేలా ఆప్‌ని రూపొందించారు. http://goo.gl/Vkfl55.
* మరో పుస్తకాల స్థావరం Free Books & Stories- Wattpad.సుమారు 20 మిలియన్ల ఉచిత ఈ-పుస్తకాల్ని అందిస్తోంది. ఇదో పుస్తక ప్రియుల నెట్‌వర్క్‌. ఆప్‌లో లాగిన్‌ అయితే కావాల్సిన పుస్తకాలతో పెద్ద గ్రంథాలయాన్నే ఏర్పాటు చేయవచ్చు. నచ్చిన పుస్తకాలపై రివ్యూలు రాసి ఇతరులతో పంచుకోవచ్చు. నెట్‌వర్క్‌ సభ్యులతో ఛాట్‌ చేయవచ్చు. http://goo.gl/5U7Wic
* వివిధ రకాల ఫార్మెట్‌లతో కూడిన ఈ-బుక్స్‌ని చదివేందుకు AlReader-any type book Reader ఆప్‌ని వాడొచ్చు.http://goo.gl/QewFyP

బ్లాక్‌బెర్రీలోనూ...
క్వర్టీ కీబోర్డ్‌తోనే కాకుండా తాకే తెరతోనూ బ్లాక్‌బెర్రీ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. బ్లాక్‌బెర్రీ ఆప్‌వరల్డ్‌తో అనేక ఆప్స్‌ని కూడా అందిస్తోంది. ఇప్పుడు ఫోన్ని ఈ-బుక్‌లా మార్చేసేలా PlayEpub Book Reader ఆప్‌ని అందిస్తోంది. ePub, Mobi, PDF ఫార్మెట్‌లను సపోర్ట్‌ చేస్తుంది. Portrait, Landscapeమోడ్స్‌లో ఆప్‌ని వాడుకోవచ్చు. ఆప్‌ రన్‌ చేయగానే ఫైల్‌ బ్రౌజర్‌లా కనిపిస్తుంది. అక్కడ కనిపించే పుస్తకాల్లో చదవాల్సిన పుస్తకంపై క్లిక్‌ చేస్తే ఓపెన్‌ అవుతుంది. చదువుకునేందుకు అనువుగా ఫాంట్‌, సైజు, లైన్‌ స్పేస్‌... అన్నింటినీ మార్పులు చేయవచ్చు. Day, Night మోడ్స్‌తో మరింత అనువుగా చదువుకోవచ్చు. పేజీల్లోని టెక్స్ట్‌ మేటర్‌ని 'హైలైట్‌' చేసుకునే వీలుంది. క్లిష్టమైన పదాలకు 'డిక్షనరీ' ఆప్షన్‌ ద్వారా అర్థాన్ని తెలుసుకునే వీలుంది. జిప్‌ ఫార్మెట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న పుస్తకాల్ని 'అన్‌జిప్‌' చేయవచ్చు. బుక్‌ కావాల్సిన మేటర్‌ని సెర్చ్‌ ద్వారా వెతకొచ్చు.http://goo.gl/JuLrZV

ఐఓఎస్‌ అయితే...

యాపిల్‌ స్థావరాలు అనేకం. వాటిల్లో పుస్తకాల స్థావరం కూడా ఒకటి ఉంది. అదే iBooks.ఐఫోన్‌ యూజర్లు ఉచితంగా ఈ-రీడర్‌ ఆప్‌ని వాడుకోవచ్చు. ఆప్‌ని నిక్షిప్తం చేసుకున్నాక ఐబుక్స్‌ స్టోర్‌ నుంచి కావాల్సిన పుస్తకాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని చదవొచ్చు. ఆప్‌లోని ఏడు రకాల ఫాంట్‌ స్త్టెల్స్‌లో కావాల్సిన స్త్టెల్‌ని ఎంపిక చేసుకోవచ్చు. మూడు రకాల పేజీ లేఅవుట్స్‌ ఉన్నాయి. పేజీ బ్యాక్‌గ్రౌండ్‌ రంగులు కూడా మూడే. పుస్తకంలో మీకు నచ్చిన టెక్స్ట్‌ మేటర్‌ని 'హైలైట్‌' చేసుకునే వీలుంది. అలాగే, పేజీలకు 'నోట్స్‌' కూడా రాసుకోవచ్చు. నచ్చిన పుస్తకానికి సంబంధించిన విశేషాల్ని ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో పోస్టింగ్‌లు చేసే వీలుంది. ఇన్‌బిల్ట్‌ సెర్చ్‌ ద్వారా పుస్తకంలోని పదాలు, వాక్యాల్ని వెతికే వీలుంది. 'స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌'ని కావాల్సినట్టుగా సెట్‌ చేసుకోవచ్చు. ముఖ్యమైన పుస్తకాల్ని, వాటికి సంబంధించిన నోట్స్‌ని 'ఐక్లౌడ్‌'లోకి అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. 'ఎయిర్‌ప్రింట్‌' ద్వారా పుస్తకాలపై రాసుకున్న నోట్స్‌ని ప్రింట్‌ తీసుకునే వీలుంది. పబ్లిక్‌ లైబ్రరీల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్నePub, PDF ఫార్మెట్‌ పుస్తకాల్ని సపోర్ట్‌ చేస్తుంది. 18 భాషల పుస్తకాల్ని చదువుకోవచ్చు. పుస్తకాల్ని ఐపాడ్‌, ఐప్యాడ్‌లోనూ సింక్రనైజ్‌ చేసుకుని చదువుకోవచ్చు.http://goo.gl/tH9qsx

పెద్ద అడ్డా...
ఆండ్రాయిడ్‌ యూజర్లకు గూగుల్‌ ప్లే స్టోర్‌లో మరో పుస్తక స్థావరం ఉంది. అదే Books. కావాలంటేhttps://play.google.com/store/booksలింక్‌లోకి వెళ్లి పొందొచ్చు. స్టోర్‌లో ఉచిత విభాగం కూడా ఉంది. హోం పేజీలోని మెనూలోకి వెళ్లి రంగాల వారీగా పుస్తకాల్ని బ్రౌజ్‌ చేయవచ్చు. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన పుస్తకాల్నిNew Arrivals విభాగంలో చూడొచ్చు. ఎక్కువ ఆదరణ పొందిన ఉచిత ఈ-పుస్తకాల్ని Top Free in books మెనూలోకి వెళ్లాలి. మీరు నిక్షిప్తం చేసుకున్న మొత్తం ఈ-బుక్స్‌ జాబితాని My books మెనూలో చూడొచ్చు.

ఇక్కడ ఈ-పత్రికలు
ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న వార, మాస పత్రికల్ని మొబైల్‌లోనూ చూడాలంటే? అందుకో ఆప్‌ సిద్ధంగా ఉంది. అదే Zinio. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. దీంట్లోని డిజిటల్‌ మ్యాగజైన్స్‌ 5000లకు పైమాటే. థంబ్‌నెయిల్‌ ఐకాన్స్‌లో పత్రికలు కనిపిస్తాయి. రంగాల వారీగా వీటిని పొందుపరిచారు. పత్రికల్ని ఫోన్‌లోకి సింక్‌ చేసుకున్నాక గ్రంథాలయంగా ఏర్పాటు చేసుకుని ఆఫ్‌లైన్‌లోనూ చదువుకోవచ్చు. కొత్త పత్రికల వివరాల్ని నోటిఫికేషన్స్‌ ద్వారా పొందొచ్చు.http://goo.gl/ZoRmmz
* ఐఫోన్‌ యూజర్లు http://goo.gl/PZ75Sm లింక్‌ నుంచి పొందొచ్చు.
* బ్లాక్‌బెర్రీ మొబైల్‌ వాడుతున్నట్లయితే 'బ్లాక్‌బెర్రీ వరల్డ్‌' నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఇదిగో లింక్‌http://goo.gl/Olo7Ll

పుస్తక స్థావరాలు
*http://books.google.co.in/books

సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ అందించే ఈ-పుస్తకాల స్థావరం. ఉచిత పుస్తకాల్ని సిస్టం నుంచి కూడా చదువుకునే వీలుంది.

*www.gutenberg.org

ఇదో ఉచిత పుస్తకాల స్థావరం. సుమారు 42,000 ఈ-పుస్తకాల్ని డేటాబేస్‌లో నిక్షిప్తం చేశారు. కావాల్సిన పుస్తకాల్ని వెతికి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎలాంటి సభ్యత్వం అక్కర్లేదు. మీరూ పుస్తకాల్ని డొనేట్‌ చేయవచ్చు.

*http://manybooks.net

దీన్ని పబ్లిక్‌ ల్రైబ్రరీగా చెప్పుకోవచ్చు. పేరొందిన పుస్తకాల్ని బ్రౌజ్‌ చేసుకుని పొందొచ్చు. ఎక్కువ ఆదరణ పొందిన పుస్తకాల్ని Papular Downloads మెనూలో చూడొచ్చు.

*www.booksinmyphone.com

స్మార్ట్‌ మొబైళ్లలోనే కాకుండా జావా ఎనేబుల్డ్‌ మొబైల్స్‌లోనూ బుక్స్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుని చదువుకోవచ్చు. 'బ్రౌజ్‌ బుక్స్‌' మెనూలోకి వెళ్లి డేటాబేస్‌లోని పుస్తకాల్ని చూడొచ్చు. చదివేందుకు అనువుగా 'బుక్‌ సెట్టింగ్స్‌'ని మార్చుకునే వీలుంది.

*www.planetbook.com

నాణ్యతతో కూడిన పుస్తకాల్ని ఉచితంగా అందిస్తున్నారు. సాహితీ ప్రియులకు ఇదో చక్కని పుస్తక వేదిక.

*www.turnit.com

ఇదో పత్రికల స్థావరం. పేరొందిన అన్ని వార, మాస పత్రికల్ని ఇక్కడ పొందొచ్చు. ఉచిత విభాగంలోకి వెళ్లి అధికారికంగా పత్రికల్ని యాక్సెస్‌ చేయవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే సైట్‌లో సభ్యులవ్వాల్సిందే.

*http://free.yudu.com

ఉచితంగా పుస్తకాల్ని నిక్షిప్తం చేసుకోవడం మాత్రమే కాకుండా మీరూ ఏదైనా పత్రికని ప్రారంభించొచ్చు. ఉచితంగా ఆన్‌లైన్‌ పబ్లిషింగ్‌ చేసేందుకు చక్కని వారధి.